PrroBooks.com » Fiction » Varshamlo Pilli (Telugu) by Sunkara Bhaskara Rao (electronic reader .TXT) 📕

Book online «Varshamlo Pilli (Telugu) by Sunkara Bhaskara Rao (electronic reader .TXT) 📕». Author Sunkara Bhaskara Rao



Varshamlo Pillii

Cat in the Rain
(American Story)
Ernest Hemingway

అమెరికన్ కథ   
వర్షంలో పిల్లి
ఎర్నెస్ట్ హెమింగ్వే 
అనువాదం: సుంకర భాస్కర రావు

 

 

ఆ హోటల్లో ఇద్దరు అమెరికన్లు మాత్రమే ఉన్నారు. వాళ్లు తమ రూము లోంచి వచ్చేటప్పుడు, వెళ్లేటప్పుడు, వాళ్లను దాటుకుని వెళ్లేవారు ఎవరూ వాళ్లకి తెలియదు. వాళ్ల రూము రెండవ అంతస్తులో, సముద్రానికి ఎదురుగా ఉంది. దానికి ఎదురుగా పబ్లిక్ గార్డెన్ మరియు వార్ మాన్యుమెంట్ ఉంది. పబ్లిక్ గార్డెన్ లో పెద్ద పెద్ద తాటిచెట్లు మరియు గ్రీన్ బెంచీలు ఉన్నాయి. వాతావరణం బాగున్నప్పుడు, ఎవరో ఒక ఆర్టిస్టు అక్కడ తన బ్రష్ లు మరియు రంగులతో పెయింట్ చేస్తూ కనిపిస్తాడు. అక్కడ పెరిగిన ఆ గుబురు తాటి చెట్లు, గార్డెన్ కి ఎదురుగా ఉన్న ఆకర్షణీయమైన ఆ హొటల్ రంగులు మరియు ఆ సముద్రం కళాకారులకు గొప్ప ప్రేరణగా కనిపిస్తాయి. అక్కడి వార్ మాన్యుమెంట్ ని చూడటానికి ఇటాలియన్స్ చాలా దూరం నుంచి అక్కడికి వస్తారు. బ్రాంజ్ తో చేయబడిన ఆ మాన్యుమెంట్ వర్షంలో మిలమిల మెరుస్తూ కనిపిస్తుంది. వర్షం పడుతూ ఉంది. తాటి చెట్ల ఆకుల నుంచి వర్షం నీరు జారి పడుతూ ఉంది. క్రింద ఉన్న ఆ కాంక్రీట్ బాటల మీద ఆ నీరు పడి చిన్న చిన్న మడుగుల్లా కనిపిస్తూ ఉంది. సముద్ర కెరటాలు వర్షంలో పెద్ద పెద్ద వరుసల్లో వువ్వెత్తున పైకి లేచి, విరిగి పడుతూ ఉన్నాయి. అవి అలా విరిగి పడి వెనుతిరిగి సముద్రంలో కలిసిపోయినా, మళ్లీ ఆ వర్షంలో ఇంకా  పెద్ద పెద్ద వరుసల్లో వువ్వెత్తున పైకి లేస్తూ, మళ్లీ విరిగి పడుతున్నాయి. వార్ మాన్యుమెంట్ స్క్వేర్ నుంచి మోటార్ కార్లు వెళ్లిపోయాయి. స్క్వేర్ లోని కపే డోర్ వే దగ్గర ఒక వెయిటర్ నిలబడి, కాళీగా ఉన్న ఆ స్క్వేర్ ని చూస్తున్నాడు.

అమెరికన్ భార్య బయటకు చూస్తూ కిటికీ దగ్గర నిలబడి ఉంది. వాళ్ల కిటికీకి సరిగ్గా క్రింద కుడి వైపున వర్షం నీరుతో తడిచి, నీళ్లు కారుతూ ఉన్న గ్రీన్ టేబుల్స్ లో ఒక దాని క్రింద ఒక పిల్లి ముడుచుపెట్టుకుని పడుకుని ఉంది. ఆ పిల్లి తను తడిచిపోకుండా ఉండాలని ఇంకా ఇంకా ముడుచుకుంటూ చాలా ప్రయత్నం చేస్తూ ఉంది

 “నేను క్రిందకి వెళ్లి ఆ పిల్లిని తీసుకొస్తాను,” అంది అమెరికన్ భార్య.

“నేను తెస్తానుండు,” ఆమె భర్త బెడ్ మీద నుంచి అన్నాడు.

“వద్దు, నేనే తెస్తాను. పాపం ఆ పిల్లి ఒక బల్ల క్రింద తడుస్తూ పొడిగా ఉండాలని ప్రయత్నిస్తూ ఉంది.”

భర్త మళ్లీ చదవటంలో కొనసాగాడు, బెడ్ కి కాళ్ల వైపున రెండు పిల్లోస్ వేసుకుని, వాటిపై సుఖంగా పడుకుని.

“తడిచిపోకు,” అన్నాడు అతడు.

భార్య క్రిందకు దిగి వెళ్లింది. ఆమె ఆఫీసు రూమ్ ని దాటుకుని వెళ్తుండగా హోటల్ మాస్టర్ లేచి నిలబడి, తల వంచి నమస్కారం చేసాడు. ఆయన డెస్క్ ఆఫీసుకి దూరంగా ఒక చివరన ఉంది. ఆయన ఒక ముసలివాడు, చాలా పొడవుగా కూడా ఉన్నాడు.

 “ఇల్ పివోవ్ (వర్షం పడుతూ ఉంది),” భార్య అంది. హోటల్ యజమాని ఆమెకి నచ్చాడు.

“సై, సై, సైనోరా, బ్రుట్టో టెంపో. ఇది చాలా బ్యాడ్ వెదర్.”

దూరంగా మసకగా ఉన్న తన రూమ్ లో డస్క్ వెనుక అతడు మర్యాదగా నిలబడి ఉన్నాడు. భార్యకి అతడు నచ్చాడు. ఏదైనా ఫిర్యాదు చేస్తే చాలా సీరియస్ గా వెనువెంటనే చర్య తీసుకునే అతని పద్ధతి ఆమెకి బాగా నచ్చింది. తన సేవలు అందించాలని ఎదురు చూసే అతని ఆతృత ఆమెకి బాగా నచ్చింది. హోటల్ మాస్టర్గా అతను ఫీల్ అవుతున్న పద్ధతి ఆమెకి ఇంకా బాగా నచ్చింది. అతడి ముసలివాడు, అతని భారీ ముఖం మరియు పెద్ద పెద్ద చేతులు ఆమెకి చాలా బాగా నచ్చాయి. 

అతన్ని మెచ్చుకుంటూ ఆమె తలుపు తెరిచి బయటకు చూసింది. వర్షం చాలా గట్టిగా కురుస్తూ ఉంది. ఒక వ్యక్తి రబ్బరు చొక్కాలో కాళీ స్క్వేర్ నుంచి కఫే లోకి వెళ్తూ కనిపించాడు. పిల్లి కుడి వైపున ఉండాలి. బహుశా అది రక్షణ కోసం బిల్డింగ్ గోడ వారన క్రింద ఎక్కడో దాగి ఉండాలి. ఆమె డోర్ వే దగ్గర అలా నిలబడి చూస్తూ ఉండగా, ఆమె వెనుక ఒక గొడుగు తెరుచుకుంది. ఆమె తమ రూమ్ అవసరాలు చూసే మెయిడ్.

 “మీరు తడిచిపోగూడదు,” ఆమె నవ్వింది, ఇటాలియన్ మాట్లాడుతూ. అవును, ఆమెని అక్కడికి ఆ హొటల్ మాస్టర్ పంపించాడు.

ఆ మెయిడ్ ఆమె తలపై అలా గొడుగు పట్టి ఉండగా, ఆమె తమ కిటికీ క్రిందకి వచ్చే వరకు అక్కడి సిమెంటు బాట మీద నడిచింది. ఆ టేబుల్ అక్కడే ఉంది, వర్షం నీటిలో బాగా తడిచి శుభ్రపడి, అది అందమైన గ్రీన్ కలర్ లో మిల మిల మెరుస్తూ కనిపించింది, కాని పిల్లి ఎటో వెళ్లిపోయింది. అది అకస్మాత్తుగా కనిపించకుండా పోయింది. ఆ మెయిడ్ తల ఎత్తి ఆమె ముఖంలోకి చూసింది.

“హా పెర్డుటో క్వాల్క్ కోసా, సైనోరా? (మీరేమైనా పోగొట్టుకున్నారా మేడమ్?)”

“అక్కడ ఒక పిల్లి ఉండాలి,” అమెరికన్ అమ్మాయి అంది.
“పిల్లా?”

“సి, ఇల్ గట్టో (అవును. ఒక పిల్లి).”

“పిల్లా?” ఆ యువతి నవ్వింది, “వర్షంలో పిల్లి?”

“అవును,” ఆమె అంది, “ఆ టేబుల్ క్రింద.” అప్పుడు, “ఓహ్, అది కావాలనుకున్నాను. నాకో పిల్లి కావాలి.”

ఆమె ఇంగ్లీష్ లో మాట్లాడినప్పుడు ఆ మెయిడ్ ముఖం బిగుసుకు పోయింది.

“రండి, సైనోరా,” ఆమె అంది. “మనం లోపలికి వెళ్లిపోవాలి. మీరు తడిచిపోతారు.”

“నేనూ అదే అనుకుంటున్నాను”, అంది ఆ అమెరికన్ అమ్మాయి.

గోడ వార నుంచి నడిచి, మెయిన్ డోర్ లోపలికి ఆమె ప్రవేశించింది. ఆ మెయిడ్ గొడుగుని ముడవటానికి డోర్ దగ్గరే ఆగిపోయింది. అమెరికన్ అమ్మాయి ఆఫీసు దగ్గర నుంచి వెళ్లినప్పుడు హొటల్ మాస్టర్ లేచి తన డస్క్ దగ్గర నుంచే వంగి నమస్కరించాడు. ఆ అమ్మాయి లోపల ఏదో తెలియని ఒక భావం చిన్నగా కనిపించింది. ఆ మాస్టర్ ఆ అమ్మాయిని చాలా చిన్నదిగా, అలాగే చాలా ముఖ్యమైనదిగా అయిపోయినట్లు అనుకునేలా చేసింది. తను చాలా అత్యున్నత ప్రాధాన్యత కలిగిన భావం ఒక్క క్షణం ఆమెని ఉక్కిరిబిక్కిరి చేసీంది. ఆమె మెట్లు ఎక్కి పైకి వెళ్లింది. ఆమె రూమ్ తలుపు తెరిచింది. జార్జ్ బెడ్ మీద చదువుకుంటూ అలాగే ఉన్నాడు.

 “పిల్లి దొరికిందా?” అతడు అడిగాడు, పుస్తకం క్రింద పెడుతూ.

“అది ఎటో పోయింది.”

“ఆశ్చర్యం, ఎక్కడికి పోయి ఉంటుంది,” అన్నాడు, చదవటం నుంచి తన కళ్లకి కాస్త విశ్రాంతి అందిస్తూ.

ఆమె బెడ్ మీద కూర్చుంది.

“అది కావాలని నేను చాలా ఆశపడ్డాను,” ఆమె అంది. “అంత ఎక్కువగా దానిని ఎందుకు ఇష్టపడ్డానో నాకు తెలియదు. ఆ పూర్ కిట్టీ నాకు కావాలనుకున్నాను. వర్షంలో తడిచిపోతున్న ఆ కిట్టీని నేను కాపాడాలని అనుకోవటం వినోదం ఏమీ కాదు.”

జార్జ్ మళ్లీ చదవటం ప్రారంభించాడు.

ఆమె ముందుకెళ్లి, డ్రెస్సింగ్ టేబుల్ అద్దం ముందు కూర్చుని, చేతి అద్దంలో తనని చూసుకుంటూ ఉంది. ఆమె తన ప్రోఫైల్ ని చూసుకుంది. ఒకసారి ముందు వైపు, ఆ తర్వాత రెండో వైపు. ఆ తర్వాత తన తల వెనుక భాగం మరియు మెడని చూసుకుంది.

 “నా జుట్టుని పొడవుగా పెంచుకోవటం  మంచి ఆలోచన అని నీకు అనిపించటం లేదా?” ఆమె అడిగింది, తన ప్రొఫైల్ వైపు మళ్లీ చూసుకుంటూ.

జార్జ్ తల పైకెత్తి, ఆమె మెడ వెనుకకి చూసాడు. ఆమె ఒక అబ్బాయిలా దగ్గరకి మడిచి, క్లిప్ పెట్టుకుని ఉంది.

“ఇది ఇలాగే నీకు బాగుంది.”

“ఇలా ఉండటం నాకు విసుగ్గా ఉంది,” ఆమె అంది. “ఒక అబ్బాయిలా కనిపించటం నాకు విసుగెత్తిస్తుంది.”

జార్జ్ బెడ్ మీద తన పొజిషన్ ని మార్చుకున్నాడు. ఆమె మాట్లాడటం ప్రారంభించినప్పటి నుండి ఆమె నుంచి దృష్టి మరల్చలేదు.

“నువ్వు చాలా అందంగా, చాలా బాగున్నావు,” అతడు అన్నాడు.

ఆమె తన చేతిలోని అద్దం డ్రెస్సర్ మీద పెట్టేసి, కిటికీ దగ్గరికి వెళ్లి, బయటకి చూసింది. చీకటి పడుతూ ఉంది.

“నాకు జుట్టు వెనక్కి విరబోసుకుని, బిగించి ముడి వేసుకోవాలని ఉంది. అలా బాగుంటుందని అనిపిస్తుంది,” ఆమె అంది. “నా వడిలో కూర్చోవటానికి ఒక పిల్లి కావాలి, దానిని నా వేళ్లతో దువ్వుతూ ఉంటే దాని బొచ్చు జలదరిస్తూ ఉండాలి.”

“అవునా?” జార్జ్ బెడ్ మీద నుంచి అన్నాడు.

“టేబుల్ వద్ద నా సొంత వెండి పాత్రలలో తినాలన్నది నా కోరిక. కేండిల్స్ ఉండాలి, స్ప్రింగ్ సీజనై ఉండాలి అవ్నది నా కోరిక. బయట నా తల విరబోసుకుని అద్దలో చూసుకుంటూ దువ్వుకోవాలన్నది నా కోరిక.
నాకు ఒక పిల్లి కావాలి, అలాగే నాకు కొత్త బట్టలు కూడా కావాలి.”

“ఓహ్, షటప్, ఏదో తీసుకుని చదువుకో...” జార్జ్ అన్నాడు. అతడు మళ్లీ చదువుకోసాగాడు.

అతని భార్య కిటికీలోంచి బయటకు చూస్తూ ఉంది.  ఇప్పుడు బాగా చీకటి పడిపోయింది.తాటి చెట్ల మీద ఇంకా వర్షం పడుతూనే ఉంది.

“ఏమైనా సరే, నాకో పిల్లి కావాలి,” ఆమె అంది, “నాకో పిల్లి కావాలి, ఇప్పుడు నాకో పిల్లి కావాలి. నాకు పొడవు జుట్టు, దాని ఆనందం లేకపోయినా సరే, నాకు ఒక పిల్లి మాత్రం ఎలాగైనా కావాలి.”

జార్జ్ వినటం లేదు. అతడు తన పుస్తకం చదవటంలో మునిగిపోయాడు. ఆతడి భార్య కిటికీలోంచి బయటకు చూస్తూ ఉంది. స్క్వేర్ లో లైట్ వెలిగింది. 

తలుపు ఎవరో తట్టారు.

“అవంతి (వెళ్లి చూడు),” జార్జ్ అన్నాడు. అతడు పుస్తకంలోంచి తల పైకెత్తాడు.

తలుపు మార్గం వద్ద ఆ మెయిడ్ నిలబడి ఉంది. ఆమె చేతుల్లో పెద్ద టార్టాయిస్-షెల్ పిల్లి ఆమె ఛాతీకి గట్టిగా అంటిపెట్టుకుని, క్రిదకి జారిపోతూ ఉంది.

“క్షమించాలి,” ఆమె అంది, “మాస్టర్ దీనిని సైనోరా కోసం తీసుకు రమ్మని చెప్పారు.”

 

Imprint

Text: Sunkara Bhaskara Rao
Images: Sunkara Bhaskara Rao
Editing: Sunkara Bhaskara Rao
Translation: Sunkara Bhaskara Rao
Publication Date: 09-21-2015

All Rights Reserved

Free e-book «Varshamlo Pilli (Telugu) by Sunkara Bhaskara Rao (electronic reader .TXT) 📕» - read online now

Similar e-books:

Comments (0)

There are no comments yet. You can be the first!
Add a comment