PrroBooks.com » Fiction » COLD ROOM TELUGU by BR Sunkara (world best books to read TXT) 📕

Book online «COLD ROOM TELUGU by BR Sunkara (world best books to read TXT) 📕». Author BR Sunkara



Cold Room Telugu

 

 

 

Himghor by Abhijit Sen
হিমঘর

 కోల్డ్ రూమ్ - అభిజిత్ సేన్

COLD ROOM (Telugu)

Benali Story by ABHIJIT SEN

Telugu: BR SUNKARA

తెలుగు : బిఆర్ సుంకర

 

కంజర్వేషనిస్టు క్వార్టర్లు ఆ రూముల పై భాగంలో మేడమీద ఉన్నాయి. వాటిని ఆనుకుని ఒక బ్యాంకు శాఖ ఉంది. కుడివేపు ఆగ్రో సర్వీస్ సెంటర్ ఉంది. ముందు భాగంలో ట్రాక్టరులు, పవర్ టిల్లర్లు, చెల్లాచెదురుగా వాటరు పంపు మిషన్లు, స్పేయర్లు, డస్టర్లు, సీడ్ షాపు మరియు ఒక రిపేరు షాపు ఉన్నాయి.

 

ఆ క్వార్టర్ల కుడివైపున పెద్ద అండర్ గ్రౌండ్ కోల్డ్ రూమ్ ఉంది. దీన్ని కాప్లెక్స్ అనవచ్చు. బెంగాలిలో దీన్నేమనాలో సరిగ్గా బంగ్లాదేశీయలకి తెలిసి ఉంటుంది. ఇలాంటి టెక్నికల్ వర్డ్స్ అనువాదంలో వాళ్లు ముందుంటారు. ఎదుట కూర్చుని స్ట్రా తో కోల్డ్ డ్రింక్ సిప్ చేస్తున్న ఆమెని ఇదే అడిగి, నిషిత్ ఆమె వైపు ఆశ్చర్యంగా చూసాడు.

 

ఆమెది భయంకరమైన అందం. ఆ అపారమైన అందాన్ని అతి ఖరీదైన సంబల్ పూర్ చీర కప్పి ఉంది. అయితే ఆమె ముఖం మీద మాత్రం విచారం నీలినీడ ఒకటి కనిపించింది. అది అసమంజసంగా ఉంది. అదీ ఆమె అందంలో ఒక భాగమేనేమో! నిషిత్ ఏదో అడగాలనుకున్నా, కొంచెం సందేహించాడు. అది ఎక్కు చొరవ తీసుకోవటం అవుతుందేమో అనుకున్నాడు. చివరికి ఇలా అన్నాడు-

 

‘‘మేడం, మీకు ఇక్కడ విసుగ్గా ఉందనుకుంటాను.”

 

ఆమె నవ్వింది. ఆమె మాటల్లాగే అదీ ఆచితూచి ఉంది. జవాబు చురుగ్గా ఉన్నా, స్వరం అణకువగానే ఉంది.

 

‘‘లేదు, ఇక్కడ అన్నీ నాకు చాలా ఇష్టం.”

 

దగ్గరలోనే ఆమె భర్త నిలబడి ఉన్నాడు. కల్నల్ అస్రఫ్ అహమద్, బహుశా నలభైఅయిదు లేదా నలభైఆరేళ్లు ఉండొచ్చు. అసాధారణ గంభీర ముద్రలో కనిపిస్తున్నాడు. ఈ అసాధారణమైన గాంభీర్యం వెనుక ఒక శక్తివంతమైన బంగ్లాదేశీయుడు. అతడు ప్రాజెక్ట్ కి సంబంధించిన సాంకేతిక విషయాలు, చిత్రాలు, అంచనాలు పరిశీలిస్తున్నాడు. ఇండియాలో కంజర్వేషన్ ప్రాజెక్టులు నవ్యతతో రూపుదిద్దుకున్నాయి. అభివృద్ధి కోరుకునే ఏ దేశానికైనా ఇది ఆశాజనకమే. ఇండియా ఈ విధమైన సలహాలను బంగ్లాదేశ్ కి అందజేస్తుంది.

 

కల్నల్ కి ఎదురుగా ఇండియా తరపున జనార్ధన మోహపాత్ర మాట్లాడుతున్నారు. ఐఏఎస్. నలభై ఏళ్ల వయసు. ఐతే ఇప్పటికే ఆరోగ్యం బాగా పాడుచేసుకున్నాడు. సాగిపోయిన దవడలు వెనకనిచి కనిపిస్తాయి. అయితే ప్రమాదం లేని అధికారి అతనిలో ఉన్నాడు. తినడమంటే చాలా ఇష్టం, ఇప్పటికే చాలా తినేసాడు. వేసుకున్న వెన్న రంగు సఫారీ సూట్ లో షేప్ లెస్ గా ఉన్నాడు. మోహపాత్ర తెలివితక్కువవాడు మాత్రం కాదు. అయినా ఒక పెద్ద దేశం అభిమాన పరాకాష్ఠత అతడిలో కనిపించటం లేదు. కల్నల్ బహుశా ఈ విషయాన్ని గమనించినట్టు కనిపించటం లేదు, కాని నిషిత్ మాత్రం సిగ్గు పడుతున్నాడు. కొందరు ఎందుకిలా ఉంటారు?

 

ఆమె బాటిల్ లో సగం తాగి, స్ట్రాని వొంచేసింది.

 

‘‘కూలింగ్ సరిగ్గా లేదనుకుంటాను.” అన్నాడు నిషిత్.

 

‘‘అలాంటిదేమీ లేదు. తాగాలనిపించ లేదు, అంతే.” అంది.

 

‘‘కోక్స్ తాగటం బాగా అలవాటై ఉంటుంది. మన లోకల్ డ్రింక్స్ ఆమెకు సరిపడలేదనుకుంటాను, అంతే కదా మేడం?” అని ఎదురుచూడని మోహపాత్ర అభిప్రాయం ఆ టేబుల్ మీదకు వచ్చి వాలింది.

 

మేడంకి కోపం వచ్చినా, నవ్వుతూ, ‘‘ఊరుకోండి మిస్టర్ మోహపాత్రా!” అంది, ఎంతో సంస్కారంతో.

 

కాని, నిషిత్ ని తమ వైపు ఏదో తెలియని తప్పు జరుగుతున్నఅస్పష్ట భావం వెంటాడుతున్నది.

 

నిజానికి రెండు పార్టీలు క్లిష్టమైన ప్రాజెక్ట్ వివరాలతో బిజీగా ఉన్నాయి. వివిధ నియమాలు-షరతులు, వివిధ రకాల పంటలు పండ్లు కాయగూరల విత్తనాలు, వివిధ శ్రేణుల స్టోరేజ్ టెంపరేచర్లు, గ్లికాన్ బ్రిన్, వేపర్ కంప్రెసర్ మొదలైనవి వారిని బిజీగా మార్చాయి. వీటన్నిటి మధ్య ఫుడ్ ప్లేట్లు వచ్చాయి. ఇది కూడా నిషిత్ బాధ్యతల్లో ఒకటి.

 

నోరూరించే ఆహారం ముందు మోహపాత్ర మరీ చిన్న పిల్లాడిలా ప్రవర్తించాడు. ‘‘తీసుకోండి.” అని నిమిషం కూడా ఆలస్యం చెయ్యకుండా ట్రే నుంచి ఒక సొమోసా తీసుకున్నాడు. కల్నల్ అతన్ని అనుసరించి, నోట్లో సమోసా మరియు స్ట్రాంగ్ బంగ్లాదేశీ యాక్సెంట్ తో నిశిత్ తో అన్నాడు, ‘‘చూడు మిస్టర్ రాయ్, ఈ కోల్డ్ స్టోరేజెస్ పెట్టింతర్వాత రాంచీ- హజీరీబాగ్ నించి వచ్చే తాజా కాలీఫ్లవర్స్ మాకు మంచి ఎండాకాలంలో కూడా లభిస్తాయి, భలేగా ఉంటుంది కదూ? ఔటాఫ్ సీజన్ లో కూడా కాలీఫ్లవర్ సమోసాలు దొరుకటం!”

 

‘‘ఔను. నిజమే!” అంటూ మేడం నవ్వింది.

 

మోహపాత్ర తినటంలో చాలా బిజీ, సమాధానం ఇవ్వలేకపోయాడు.

 

‘‘ఔను సార్. తప్పకుండా!” అన్నాడు నిషిత్. వెంటనే కల్నల్ కావాలనే సరిపోల్చి ఉంటారని నిషిత్ ఆశ్చర్యపోయాడు. రాంచీ-హజీరిబాగ్ నుంచి కాలీఫ్లవర్స్ దిగుమతి మరియి అమెరికా నుంచి కోక్ దిగుమతి మధ్య పోలిక సరిపోల్చటమేమో.

 

అసాధ్యం కాదు. బంగ్లాదేశీయుల గాంభీర్యం వెనుక అనేక ఇతర అలవాట్లు కూడా దాగి ఉండవచ్చు.

 

చివరికి, మేడం కాఫీ కప్పు పట్టుకుని నిలబడింది. బయటకు నడిచింది. మిగతావాళ్లు కూడా ఆమె వెనుక నిలబడ్డారు. బయట నీరెండలో పచ్చపచ్చని లేత వరి పొలం ఒక హరిత సాగరంలా ఆహ్లాదంగా కనిపించింది.

 

‘‘ఎంత అందంగా ఉంది!” అంది మేడం.

 

నిషిత్ మృదువుగా అన్నాడు, ‘‘మీరన్నది నిజం. నేను వర్షాకాలం ముందు ఇక్కడికొచ్చాను. ఇది ఇంత అందంగా మారుతుందని అప్పుడు నేను అనుకోలేక పోయాను. మీ వైపు వరి పంట బాగా పండుతుందని నేను విన్నాను, ఔనా?”

 

‘‘ఔను, నేనూ విన్నాను. కాని మీలాగే, ఆ వరి పొలాలు చూడటానికి సమయం కేటాయించలేక పోయాను. నేను చిన్నప్పటి నుంచి అర్బన్నే, మరి మీరు?”

 

‘‘నేను పుట్టింది ఫరీద్ పూర్, కాని-”

 

నిషిత్ ఆగాడు. అతడికి ఇదంతా విచిత్రంగా అనిపించింది. ఒక భారతీయుడు ఒక బంగ్లాదేశికి తన జన్మభూమి ఫరీద్ పూర్ అని ఇలా చెప్పడం!

 

మోహపాత్ర కాఫీ కప్పు ఖాళీ చేసి అన్నాడు, ‘‘రండి, కిందకెళ్దాం.”

 

కిందకంటే కోల్డ్ రూమ్ కి.

 

అందరూ మెట్ల వైపు నడిచారు. ముందుగా వేర్ హౌస్ ఆఫీసర్, ఆతర్వాత మోహపాత్ర, కల్నల్ – ఆ తర్వాత రెండు వైపుల నుండి వచ్చిన ప్రత్యేక ప్రతినిధులు, చివరగా నిషిత్ మరియు మేడం. ఆ స్టెయిర్ కేస్ చాలా క్రిందకి అండర్ గ్రౌండ్ లోకి వెళ్లింది. ఎవరో లైట్ వేసారు. ఆ చీకటి గుహలో నెమ్మదిగా వెలుగు పరుచుకుంది.

 

మెట్ల చివర కోల్డ్ రూమ్ కి తలుపు ఉంది. ఆ తలుపు తెరవగానే ఎండుతున్న పండ్లు, డ్రగ్లు మొదలైనవ వాటి ఘాటు వాసన వచ్చింది. సడన్ గా వచ్చిన ఒక చల్లని గాలి తెర అందరి ముఖాలని తాకింది. వారి మాటలన్నీ ఆగిపోయాయి. ఏదో కనిపించని మెరుపు. ఆ మెరిసే వెలుగులో కోల్డ్ రూమ్ చాలా పాతదిగా కనిపించింది, ఇంచుమించు ప్రీహిస్టారిక్.

 

మృదువుగా మేడం అంది, ‘‘రాయ్ గారూ, మీరు ఫరీద్ పూర్ లో పుట్టామన్నారు. నేనెక్కడ పుట్టానో మీకు తెలుసా?”

 

‘‘తెలియదు.”

 

‘‘నేను పుట్టింది కోల్ కతాలో.”

ఆమె నవ్విందేమో, వారి చుట్టూ పరచుకున్న నీడలాంటి చీకటిలో అది దాగి వుండాలి. వాళ్లు మృదువుగా గుసగుసలతో మాట్లాడుకుంటున్నారు. పాత ప్రపంచం వాసనలు మరియు పార్మల్ డిహైడ్ ఘాటు వాళ్లని తాకుతున్నాయి.

 

‘‘నిజంగా? కోల్ కతాలో ఎక్కడ?”

 

‘‘పార్క్ సర్కస్.”

 

‘‘ఏ వీధి?”

 

‘‘జ్ఞాపకంలేదు. జ్ఞాపకంలేదు కాని, ఒకసారి చూస్తే తప్పకుండా గుర్తు పడతాను. రాయ్ గారూ, దయచేసి నన్ను పార్క్ సర్కస్ కి తీసుకెళ్లగలరా?”

 

ఆమె గొంతులో అమితమైన ఉత్సుకత, ఆవేశం కనిపించాయి.

 

‘‘అది ప్రాబ్లం కాదు, ఇవాళే వెళదాం.”

 

‘‘కాని కల్నల్ కి ఏమీ చెప్పకూడదు.”

 

‘‘ఎందుకని? నా ఉద్దేశం-”

 

బేగమ్ అహమద్ నిశ్శబ్దంగా షెల్ఫ్ లోంచి ఒక టొమేటో తీసి పరీక్షించ సాగింది. చెప్పని విషయాలు చాలా ఉన్నాయి. వాటిని అర్థం చేసుకునే నిశ్శబ్దంలో నింపాలి. .ఒకే భాష, ఒకే రూపం, ఒకే స్వభావం, ఒకే భౌగోళికం కలిగివున్నా, మనిషి ఎవరి బరువు వాళ్లే మోసుకోవాలి. ఒకరినొకరు తెలుసుకున్నది చాలా తక్కువ. బంగ్లాదేశ్ లో కల్నల్ జీవితంలో గత పదిహేను-పదహారు సంవత్సరాలలో చోటుచేసుకున్న సమస్యలను నిషిత్ అర్థం చేసుకోగలడా? మనమంతా ఈ అనిశ్చితితో బ్రతికాం, ఈ అనిశ్చితి – భగవంతుడు ఉన్నాడా లేడా అనే ప్రశ్నలా- చాలా విడ్డూరమైన వ్యంగ్యోక్తి. కల్నల్ జీవితంలో ఎలాంటి భావోద్వేగాలకు తావులేదు. బేగమ్ గుసగుసలాడుతూ చెప్పింది, ‘‘మీరు ఒంటరిగానే దీన్ని మేనేజ్ చెయ్యాలి. ఏదోలా, సైట్ సీయింగ్, విక్టోరియా, ఏదో ఒక సాకు, మీ ఇష్టం. అవును, చాలా కాలం అయింది - ”

మేడం గొంతు వాదించింది. ఆమె నిస్సందేహంగా కోల్డ్ రూమ్ లోకి ప్రవేశించింది.

 

నిషిత్ ఒకసారి కల్నల్ వైపు చూసాడు. అతనికి ఒక సాంకేతిక నిపుణుడు ఏదో విషయాన్ని వివరిస్తున్నాడు. అతని ముఖం భావోద్వేగం లేకుండా, కోల్డ్ గా ఉంది. ఇతడు ఎల్లప్పుడు తన చుట్టు ఒక గోడ కట్టుకుని ఉంటాడు.

 

నిషిత్ టాపిక్ ని మళ్లీ ఎలా తీసుకు రాగలడు?

 

మేడం గొంతు మళ్ళీ వాదించింది, ‘‘ప్లీజ్, రాయ్ గారూ? ”

 

**** **** ****

కారు తిన్నగా పార్క్ స్ట్రీట్ లోంచి పార్క్ సర్కస్ గ్రౌండ్స్ వైపు వెళ్లింది. ఎడంవైపు అమీర్ అలీ అవెన్యూ లోకి తిరిగే సరికి, పెట్రోల్ మరియు డీజిల్ పొగమంచు తెరలు సాయింత్రాన్ని చీకటిగా చేసేసాయి. ఈ పొరల నుంచి వెలుగు చాలా దూరం చొచ్చుకు పోలేకపోతున్నది. ప్రతి ఒక్కటి మబ్బుగా, మిస్టరీగా కనిపిస్తున్నది.

 

‘‘అంతా రద్దీగా మారిపోయింది!”

 

‘‘ఔను, బిల్డింగులు, కార్లు...”

 

‘‘మా చిన్నతనంలో ఈ అవెన్యూ చాలా అందంగా ఉండేది. ఇక్కడే ఎక్కడో మా కాన్వెంట్ స్కూల్ ఉండేది.”

 

‘‘ఈ పరిసరాల గురించి నాకు అంతగా తెలియదు మేడం. ఇక్కడకు నేను అప్పుడప్పుడు మాత్రమే వస్తుంటాను!”

 

‘‘సరే. అరే, ఆ కుడివైపున, అది బెక్ బగాన్ కదా?”

 

‘‘ఔను, అది బెక్ బగానే!”

 

‘‘ఇంకొంచెం ముందుకు వెళ్దాం!”

 

కారు కొంచెం ముందుకి పాకింది.

 

‘‘ప్లీజ్, ఒక్క క్షణం ఆగండి!”

అక్కడ పక్కకు చిన్న రహదారి ఉంది. కొన్ని చెట్లు కూడా. ఎడమ వైపు ఫుట్ పాత్ ని ఆనుకుని కారు ఆగింది.

 

‘‘ఇక్కడ ఒక ప్లే గ్రౌండ్ ఉండేది.” ట్రక్కులు, కార్లతో రద్దీగా ఉన్న ఒక గ్యాస్ స్టేషన్ వైపు చూపిస్తూ బేగమ్ అహమద్ అంది. ఆమె కళ్లు బాధ మరియు నిరాశతో చెమ్మగిల్లాయి.

 

‘‘ఇక్కడ ప్లే గ్రౌండా?”

 

‘‘అవును, సుమారు ఇరవైఅయిదు - ముప్పై సంవత్సరాల క్రితం. ప్లే గ్రౌండ్ లేదా ఖాళీ స్థలం. మేము అక్కడ ఆడుకునేవాళ్లం.”

 

బేగమ్ పోగొట్టుకున్న తన బాల్యాన్ని నిశ్శబ్దంగా కార్ విండో నించి వెదుక్కుంది. ధూళి నిండిన ఆ సంధ్యా సమయంలో విభిన్న మైన ఒంటరితనం బరువుగా అడుగులు వేస్తూ, మిగతా రాత్రిని దాటే ప్రయత్నంతో భయపెడుతున్నది. బరువగా, తీరికలేక అస్తవ్యస్తంగా కనిపించే ఈ నగరాన్ని మరిచి, ఈ సంగతిని గమనించటం కొంచెం బాధాకరమే. మిగతా నగరం అంతా నిర్లక్ష్యంగా మరోవైపు పోతుంటే, గతం అనే శవం, జ్ఞాపకాలు ఈ చీకట్లో అక్కడెక్కడో ఒక మూల దాగి ఉన్నట్లు కనిపించాయి.

 

‘‘ఇప్పుడెక్కడకి వెళ్లాలి మేడం?”

 

‘‘ఇంకొంచెం ముందుకి వెళ్దాం. కుడివైపు ఒక సందు ఉంది కదా? ” ఆమె కళ్లు సగం మూసుకొనే అడిగింది.

 

‘‘అవును, ఉంది.”

 

‘‘దయచేసి అటు తిప్పండి రాయ్ గారూ.”

 

డ్రైవర్ కి డైరెక్షన్ అవసరం రాలేదు.

 

కల్నల్ కి కూడా సూచనల అవసరం కలగ లేదు. సాయంత్రం అతనికి కావలసినంత ఆల్కహాల్ ఒక్కటే కావాలి. మోహపాత్ర గారు ఆయనతోనే ఉన్నారు కూడా.

 

‘‘ఇక్కడ ఒక గరల్స్ స్కూల్ ఉండేది. మా అక్కలిద్దరూ దానిలోనే చదివేవారు.”

 

‘‘అది ఇంకా ఇక్కడే ఉంది. అదిగో అక్కడ కుడివైపున! అయితే అదే విధంగా కనిపించటం లేదు, రాయ్ గారూ! ఇంత జనం, ఇన్ని బిల్డింగులు, పొడవుగా. ఆ ఖాళీ చోట్లు అన్నీ ఏమయ్యాయి?”

 

బేగం తనలో తానే మాట్లాడుకుంటున్నది. అక్కడ ఇద్దరు చిన్న పిల్లలు మాట్లాడుకుంటున్నారు. వాళ్లు ప్రాక్ లు వేసుకని ఉన్నారు.

 

బేగం విండోలోంచి తల బయటకు పెట్టి, వాళ్లని నిశితంగా చూసింది. కారు నత్త నడక నడుస్తూ ముందుకు పాకుతున్నది.

కుడివైపు రెండు వీధులు విడిపోయి ఉన్నాయి. ఆ రెండిటి మద్య కారు ఆగింది. చీకటి పడుతున్న ఆ సంధ్యా సమయంలో బేగం అస్రఫ్ అహమద్ తన జ్ఞాపకాలను వెదుక్కుంటూ విండో లోంచి నిర్విరామంగా బయటకు చూసింది. కాసేపు తర్వాత, ఆమె అకస్మాత్తుగా మాట్లాడింది.

 

‘‘కాసేపు కిందికి దిగుతాను.”

 

‘‘తప్పకుండా.”

 

నిషిత్ డోర్ తెరచి పట్టుకున్నాడు.

 

బేగం అహమద్ బయటకు వచ్చి, కాసేపు నిలబడింది. ఆ తర్వాత లక్ష్యంలేకుండా, నిద్రలో నడుస్తున్నట్లుగా, ముందుకు నడుస్తూ తనలో తానే మాట్టాడుకో సాగింది.

 

‘‘మీకు నా పేరు తెలుసా? నా పేరు - .” ఆమె చిన్నగా నవ్వి, అకస్మాత్తుగా వెనక్కి తిరిగింది.

 

‘‘మేము ఈ చోటుని 55 లేదా 56లో వదిలిపెట్టాం.”

 

ఆమె అకస్మాత్తుగా ఒక పొడవైన స్తంభాల మేడ ముందు నిలబడింది.

 

‘‘ఇక్కడ మిలి ఆంటీ ఉండేది. మేడ మీద టిలు ఆంటీ.”

 

‘‘ఇప్పటికీ ఇంకా ఎవరైనా ఉన్నారేమో చూస్తారా?” నిషిత్ అడిగాడు.

 

‘‘చూద్దామా?” ఆమె సందేహంగా అడిగింది.

 

‘‘వద్దు. వాళ్లకేమీ గుర్తు లేకపోతే? వాళ్లని అలాగే ఉండనిద్దాం.” అని తర్వాత అంది.

 

ఆమె మరి కొన్ని అడుగులు ముందుకేసింది. కాసేపు ఆగి, మళ్లీ మరి కొన్ని అడుగులు. ప్రతి ఇంటి కిటికీ నించి వెలుగు, టెలివిజన్ శబ్దాలు బయటకి వస్తున్నాయి. కొన్ని కిటికీల దగ్గర పిల్లలు హోం వర్క్ మీద వొంగి కనిపించారు.

 

ప్రతి చోట సామాన్య జనం వెలుగు నీడల మధ్య కదులుతూ, పనులు చేసుకుంటూ కనిపించారు. బేగం వారి మధ్య ఏదో కనుగొనటానికి. వాళ్లని తాకాలని అనుకుంది.

 

‘‘ఇక్కడే, చూడండి, సరిగ్గా ఇక్కడే ఎక్కడో, మా ఇల్లు ఉండేది. ఇప్పుడు కూడా అది నా కళ్లలో ఇంకా కనిపిస్తూనే ఉంది. ఇక్కడ ఒక పెద్ద వాకిలి ఉండేది, ఈ పక్క దారితో కలిసిపోయి. ఆ వాకిలి చుట్టూ నడుం ఎత్తున ఇనుప కటకటాలు ఉండేవి. ఆ ఇంట్లో ఒక ముసలామె ఉండేది. అయితే ఆమెని మేము మామ్మా అనేవాళ్లం కాదు, ఆంటీ అని గాని, మరేదో పేరుతో పిలిచేవాళ్లం. కిటికీ దగ్గర కూర్చుని పుస్తకాలు చదవటం ఆమెకి చాలా ఇష్టం. పెద్దల పుస్తకాలు కాదు, పిల్లల పుస్తకాలు, డిటెక్టివ్ కథలు మరియు రొమాంటిక్ మిస్టరీలు. మేము తరచుగా ఆమెకి మా పుస్తకాలిచ్చి, ఆమె దగ్గరున్న పుస్తకాలు లెండింగ్ కి తీసుకునేవాళ్లం. ఆ పక్క రెండంతస్తుల ఇల్లు ఉండేది. మా ఫ్రండ్ సుశోభన్ అక్కడే ఉండేవాడు. ఆ ఇంటి తర్వాత ఒక సన్నని సందు ఉండేది. అది బహుశా ఇక్కడే అనుకుంటాను రాయ్ గారూ.”

 

బేగం ఆగి ఒకసారి తన చుట్టూ చూసుకుంది. చుట్టూ అలుముకుని ఉన్న ఆ సంధ్య చీకట్లు కూడా ఆమె కళ్లలో కనిపించే నిరాశ, శూన్యతలను దాచలేకపోయాయి. కాసేపు తర్వాత ఆమె తన కథ మళ్లీ ప్రారంభించింది.

 

‘‘ఆ సందు గోడల మీద, ఎవరో మా అక్క పేరుతో అసభ్య పదాలు రాసారు. ఆ సందు చివరనే మా ఇల్లు ఉండేది. ఇప్పుడా సందు ఎక్కడుంది?” ఆమె బయటకు ఏడ్చింది.

 

అప్పటికే వాళ్లు చాలా దూరం నడిచారు. వాళ్ల వెనుక స్కూలు దగ్గర డ్రైవరు కారుని పార్కు చేసి, వాళ్ల కోసం ఎదురు చూస్తున్నాడు. బేగం అహమద్ కాసేపు నిశ్శబ్దంగా నిలబడింది.

 

‘‘అది ఇక్కడే, సరిగ్గా ఇక్కడే ఉండేది రాయ్ గారూ”

 

‘‘తప్పకుండా మేడం.”

 

‘‘కాని ఈ బిల్డింగులన్నీ? ఎక్కడి నించి వచ్చాయి ఇవన్నీ? అంతకు ముందు ఇవిక్కడ లేవు.”

 

‘‘మహానగరాలు విస్తరించేదలాగే మేడం.”

 

‘‘మనం ఆ ఎడమ సందులోకి వెళ్లి చూద్దామా? మిమ్మల్ని నేను ఇబ్బంది పెట్టటం లేదు కదా?”

 

‘‘అయ్యో, లేదు మేడం. కావలసినంత సమయం తీసుకోండి.”

 

‘‘లేదు, నాది స్వార్ధమే. పగలంతా మీరు కష్టపడ్డారు. ఈ సాయింత్రం మిమ్మల్ని నా సొంత పనికి ఉపయోగించు కుంటున్నాను.”

 

‘‘లేదు మేడం. నిజాయితీగా చెబుతున్నా, ఏమీ పర్వాలేదు. ”

 

‘‘ఈ సందులోంచే మేము నడిచేవాళ్లం. ఈ వీధిలోంచి తిన్నగా వెళ్లితే, ఇది తిన్నగా వెళ్లి గురుసదాయ్ మెయిన్ రోడ్ లో కలుస్తుంది. అవునా?”

 

‘‘అవును.”

 

‘‘మా చిన్నతనంలో ఈ రోడ్లన్నీ ప్రశాంతంగా ఉండేవి.”

 

“ ఇప్పుడు ఇవి ఈ జనంతో కిటకిటలాడుతున్నాయి. గుర్తు పట్టలేనంతగా.”

 

‘‘గురుసదాయ్ కుడి వైపు ఉంది. అంతకు ముందు ఎడమ వైపున ఒక చిన్న వీధి ఉండేది. జనం చాలా తక్కువ. అన్ని ఇళ్లలో ఎత్తుగా పూలమొక్కలు ఉండేవి. సుమారుగా. పిల్లలమంతా తెల్లారకముందే అక్కడికెళ్లి, పూలు దొంగతనం చేసే వాళ్లం. రాయ్ గారూ, మీరెప్పుడైనా సూర్యకాంతం మొక్క కొమ్మ విరిచే ప్రయత్నం చేసారా?”

 

‘‘లేదు. ఎందుకని?”

 

‘‘అది చాలా కష్టం. సూర్యకాంతం మొక్క కొమ్మ సులభంగా విరగదు. ఒకసారి సుశోభన్ నా కోసం ప్రయత్నించాడు- వద్దు, ఇప్పుడదంతా అనవసరం లెండి.”

 

‘‘మేడం, పావుదక్కువ ఎనిమిది. కల్నల్ ఎదురుచూస్తుంటారేమో!” అన్నాడు నిషిత్.

 

‘‘అవును.” మేడం అకస్మాత్తుగా ప్రస్తుతానికి వచ్చింది.

 

‘‘అవును, కల్నల్ ఎదురుచూస్తుంటారు! నిస్సందేహంగా చికాకుపడుతుంటారు! కాని, రాయ్ గారూ, ఇక్కడ ఎక్కడా మా ఇల్లు కనిపించటం లేదు. మా నాన్న ఇంకా బతికే ఉన్నారు. ఇంకా, ఈ నగరాన్నే తన మాతృ భూమిగా తలుస్తున్నారు. ఆయన, ఎంత దేశద్రోహి! ఆయన ఇల్లెక్కడుందో ఆయనకి నేను చెప్పాలని ఆశిస్తున్నాను.”

 

‘‘మా నాన్న కూడా అంతే. ఫరీద్ పూర్ లోని ఒక కుగ్రామమే తన మాతృ భూమి.” అన్నాడు నిషిత్.

 

బేగం ఇళ్ల గుంపును ఒక సారి చివరి సారిగా చూసింది. తర్వాత గాఢంగా ఒక నిట్టూర్పు విడిచింది.

 

‘‘పదండి పోదాం. ఇది అర్థం లేని అన్వేషణ!”

 

అప్పుడే కారు వచ్చి వాళ్ల వెనుక ఆగింది. డ్రైవర్ వాళ్లని చూస్తూ ఉన్నాడు. వాళ్లు తిరుగు ప్రయాణానికి సిద్ధంగా ఉన్నారని గమనించాడు.

 

నిషిత్ కారు డోరు తెరచి పట్టుకుని, ‘‘రండి మేడం.” అన్నాడు.

 

ఆమె వచ్చి కూర్చుంది.

 

కారు వెనక్కి తిరిగి, పార్క్ సర్కస్ మార్కెట్ వేపు వెళ్లింది. బేగం తల వాల్చి, నిశ్శబ్దంగా కన్నీళ్లు కార్చింది.

 

 

 

 

 

.

 

 

Imprint

Text: Sunkara Bhaskara Rao
Images: -
Editing: Sunkara Bhaskara Rao
Translation: Sunkara Bhaskara Rao
Publication Date: 09-02-2017

All Rights Reserved

Free e-book «COLD ROOM TELUGU by BR Sunkara (world best books to read TXT) 📕» - read online now

Similar e-books:

Comments (0)

There are no comments yet. You can be the first!
Add a comment